రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్- గ్రామీణాభివృద్ధి.
ప్రతి దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తమ ప్రజల అభ్యున్నతి కొరకు వివిధ అభివృధ్ది పథకాలను ప్రకటించడం సహజం. అందులో వ్యక్తిగత అభివృధ్దికి ఉద్దేశించినవి మరియు సామాజికాభివృధ్దికి ఉద్దేశించినవి అనే రెండు రకాల పథకాలు ఉంటాయి. అలాగే మన దేశములో కూడా మన కేంద్ర ప్రభుత్వము దేశ పౌరుల అభివృద్ధి కొరకు, కూడా వివిధ రకాల పథకాలను ప్రకటించి వాటిని అమలు చేయుచున్నది. అందులో ప్రజలకు కావలిసిన మౌళిక వసతుల కల్పన కొరకు బాద్యత వహించు స్థానిక ప్రభుత్వాలు అయిన పంచాయతీలకు, కావలసిన నిధులను సమకూర్చుట కొరకు కేంద్ర ప్రభుత్వము ప్రకటించి అమలు చేయుచున్నపథకము వేరే “రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్”.
ఈ పథకము అమలుకు కావల్సిన నిధులను 60% కేంద్రం, 40% రాష్ట్రాలు భరించాలని నిబందన. అదే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కేంద్ర రాష్ట్రాల వాటాల నిష్పత్తి 90% మరియు 10%. ఈ పథకములో నిధులను రెండు విడతలుగా కేంద్రం విడుదల చేస్తుంది. కేంద్రం విడుదల చేసిన నిధులకు రాష్ట్ర వాటాగా 40%, ఈశాన్య రాష్ట్రాలయితే 10% నిధులను కలిపి ఈ పథకం అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా నిధులను కేటాయించని రాష్ట్రాలకు రెండవ విడత నిధులను కేంద్రం విడదల చేయదు.
ఈ పథకములో రెండు బాగాలు ఉన్నాయి.
- గ్రామాలలో మౌళిక వసతుల కల్పన. ( పంచాయతి కార్యాలయము ఏర్పాటు చేయుటకు తగిన వసతి లేనియెడల నూతన భవన నిర్మాణము, భవన మరమ్మత్తులు మరియు అంతర్జాల సేవలు అందించటకు కావల్సిన సంఘణకాలు (కంప్యూటర్ తదితర పరికరాలు) సమకూర్చడం.
- స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మరియు అందులో పనిచేయుచున్న ఉద్యోగులకు సామర్థ్య పెంపుదలకు కావల్సిన శిక్షణ అందించడం. ఇందులో అతిముఖ్యమైనదేమిటీ అంటే, స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరికీ ఆరు నెలల లోగా పంచాయితీ పరిపాలన విధానాల గురించి, ప్రాథమిక శిక్షణ అందించడం మరియు రెండు సంవత్సరాలకు పరిపాలనలో తమకు ఎదురైన సమస్యల పరిష్కార విధానాలపై పునఃఛ్ఛరణ(రిఫ్రెషర్) శిక్షణ అందించడం.
వాస్తవంగా ఈ పథకము గత దశాబ్ద కాలంగా అమలవుతున్న పథకమే అయినప్పటికి దీనిని 2016-17లో “రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్” గా పేరు మార్చి 31 మార్చి 2022 వరకు అమలు చేయాలి అసకున్న అనుకున్న కేంద్రం, దీని ద్వార వస్తున్న సత్ఫలితాలను చూసి మరి కొంత కాలం అనగా 31 మార్చి 2026 వరకు పొడగించడం అభినందనీయము.
ఈ పథకము యొక్క ముఖ్య ఉద్దేశము
- సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాదించడానికి పంచాయతీరాజ్ సంస్థల యొక్క పాలనా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం.
- అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించి, సమ్మిళిత స్థానిక పాలన కోసం పంచాయతీల సామర్థ్యాలను మెరుగుపరచడం.
- జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యలను పరిష్కరించడానికి ఇతర పథకాలతో సమన్వయం చేయడం.
- పంచాయితీలు తమ స్వంత ఆదాయ వనరులను పెంచుకునే సామర్థ్యాలను పెంపొందించుకోవడం కొరకు తగిన అవగాహన కల్పించడం.
- పంచాయతీ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంపొందించడానికి గల ప్రాథమిక వేదికగా ఉన్న ఒకే ఒక వేదికైన గ్రామసభలను సమర్థవంతంగా పనిచేయడానికి బలోపేతం చేయడం.
- రాజ్యాంగం మరియు PESA చట్టం 1996 స్ఫూర్తి ప్రకారం పంచాయతీలకు అధికారాలు మరియు బాధ్యతల వికేంద్రీకరణను ప్రోత్సహించడం.
- పంచాయతీరాజ్ సంస్థల కోసం సామర్థ్య పెంపు కొరకు తగిన శిక్షణ అందించడానికి మరియు సముచిత సలహాలను అందించడానికి (హ్యాండ్‌హోల్డింగ్‌కు) మద్దతు ఇవ్వడానికి అత్యుత్తమ సంస్థల సమాహారముల (నెట్‌వర్క్)ను అభివృద్ధి చేయడం.
- వివిధ స్థాయిలలో పంచాయతీరాజ్ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంస్థలను బలోపేతం చేయడం మరియు వాటిని తగిన నాణ్యతా ప్రమాణాలను సాధించేలా చేయడం.
- మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, మానవ వనరులు మరియు ఫలితాల ఆధారిత శిక్షణ.
- పరిపాలనా సామర్థ్యం మరియు మెరుగైన సర్వీస్ డెలివరీ కోసం పంచాయితీలలో సుపరిపాలనను ప్రారంభించడానికి ఇ-గవర్నెన్స్ మరియు ఇతర సాంకేతిక ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించడం.
- పనితీరు ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థల ను గుర్తించి, ప్రోత్సహించడం.
No comments:
Post a Comment