Important Pages for Administration of Panchayat

Wednesday, June 25, 2014

అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా గ్రామపంచాయతీ ఉద్యోగులకు జరిగిన అన్యాయం.

 అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణా జిల్లాలోని ఉద్యోగులకు, ముఖ్యంగా గ్రామపంచాయతీలలో తాత్కాలిక పద్దతిలో మరియు స్థిరవేతనము పై పనిచేయుచున్న ఉద్యోగులకు తీవ్ర అన్యాయము జరిగిందనడానికి చాలా నిదర్శణాలు కలవు. అప్పటి ప్రభుత్వములో స్థిరవేతనము పై మరియు కాంటింజెంట్ వేతనముల పై పనిచేయు చున్న ఉద్యోగులను క్రమబద్దీకరించి వారికి స్కేలు మంజూరి చేయుటకు గాను. ప్రభుత్వము వారు 212 మరియు 112 జి.వోల. ద్వార ఉత్తర్వులు జారిచేసినారు. కాని అట్టి ఉత్తర్వుల ద్వార లాభ పడింది తెలంగాణా జిల్లాల లోని ఉద్యోగులకంటె ఆంధ్ర ప్రాంత జిల్లాల వారే ఎక్కువ అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతములో స్థిరవేతనము పై మరియు కాంటింజెంట్ వేతనముల పై పనిచేయు చున్న ఉద్యోగులను క్రమబద్దీకరించే అధికార వర్గము ప్రభుత్వము జారి చేసిన జి.వోలను మరియు వాటికనుగుణంగా జారిచేసిన వివరణల ఉత్తర్వులను, తెలంగాణా ప్రాంత ఉద్యోగులకు  అన్వయించుటలో   ఒక విధంగా, వాటినే ఆంధ్రప్రాంతము వారికి అన్వయించుటలో చూపిన తారతమ్యము వలన తెలంగాణ ప్రాంత గ్రామపంచాయతీల లో తాత్కాలిక మరియు స్థిరవేతనము పై పని చేయుచున్నవారికే గాక, పనిచేస్తు చనిపోయిన ఉద్యోగులకు తీవ్ర అన్యాయము జరిగినది.

ఖమ్మం జిల్లాలో పంచాయతీ రాజ్ సంస్థలో  తాత్కాలిక పద్దతిలో పనిచేయుచున్న ఉద్యోగిని క్రమబద్దీకరించడానికి మీనమేషాలు లెక్కించిన అధికారవర్గమును ఎదిరించి తనకు న్యామయు చేయవలసినదిగా, దేశములోని అత్యున్నత న్యాయస్థానమును ఆశ్రయించితే గాని అతని సర్వీసును క్రమబద్దీకరించని ప్రభుత్వ యంత్రాంగము (జి.వో కొరకు ఖమ్మం జి్ల్లాలోని నియామకం లింకు పై క్లిక్ చేయండి), ఆంధ్ర ప్రాంతములోని కృష్ణా జిల్లాలోని తిరువూరు గ్రామ పంచాయతీలో తాత్కాలిక వేతనముపై పని చేయుచున్న బోర్ మెకానిక్కును అతను చనిపోయిన 6 సంవత్సరముల తర్వాత అతను పనిచేయుచున్న ఉద్యోగమును క్రమబద్దీకరించి, అతని భార్యను, ఆమెకు ఉన్న విద్యార్హతల కు తగిన ఉద్యోగములో నియమించుటకు ఆదేశాలు జారిచేయుటను ఏ విధంగా అర్థము చేసుకోవాలి. (జి.వో. కొరకు క్రిష్ణా జిల్లాలో క్రమబద్దీకరణ లింకు పై క్లిక్ చేయండి). అలా క్రమబద్దీకరణ జేయడమే కాకుండా, అక్కడి వారికి అనగా ఆ జిల్లా లోని గ్రామపంచాయతీలలో పనిచేయుచున్న వారికి ప్రత్యేకముగా, వేతన బఖాయాలను చెల్లించుటకు గాను ప్రభుత్వ నిధులనుండి ఒక కోటి డెబ్బది ఆరు లక్షల రూపాయలను కూడా విడుదల చేయడము జరిగినది.(జి.వో.కొరకు క్రిష్ణా జిల్లాలో 87 గ్రామపంచాయతీల ఉద్యోగు ప్రత్యేకంగా వేతనాలు విదుడల లింకుపై క్లిక్ చేయండి). అంటె వడ్డించె వారు మనవారైతె మనం ఏ పంక్తిలో ఉన్నా మనకు వడ్డన అందుతుంది అన్న ఆర్యోక్తి నిజమైంది. ఈ విధంగా చనిపోయిన వారు, వయసు పై బడి మానేసిన వారు, రిటైర్మెంటు వయసు చేరుకున్నారని ఉద్యోగములో నుండి తొలగించబడిన వారు తెలంగాణ జిల్లాలో వేల మంది ఉన్నారు. ప్రజల ఆరోగ్యము కాపాడుట కోసం, తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, సమాజానికి శాయశక్తులా తమ సేవలందించి, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఏ దారి చూపని వారు చనిపోగా మిగిలిన వారి కుటుంబ సభ్యులు, వయసు పైబడిన కారణంగా తొలగించిన వారు, తమ కుటుంబ సభ్యులకు భారమై,  దుర్భర జీవితాన్ని కొనసాగిన్నవారు తెలంగాణాలో చాలా మంది ఉన్నారు. వీరిక సహాయము చేయుటకు, ప్రభుత్వ ఉత్తర్వులు లేని కారణంగా దిగువ స్థాయి అధికారవర్గము కూడా నిస్సహాయత వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.  
ప్రస్థుతము తెలంగాణా ప్రభుత్వము తెలంగాణా జిల్లాలోని గ్రామపంచాయతీలో తాత్కాలిక పద్దతిలో గాని, స్థిర వేతనము పై పని చేయుచున్న వారి, పనిచేస్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల, వయసు పైబడిన కారణంగా ఉద్యోగమునుండి తీసివేసిన వారి జీవితాలు బాగుపడేవిధంగా, ప్రస్థుత ప్రభుత్వము ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాము.



Saturday, June 21, 2014

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పంచాయతీలకు అధికారవికేంధ్రీకరణ జరగాలి.

భారత దేశములో స్థానిక ప్రభుత్వాలకు అధికారాల బదలాయింపు పరిస్థితి

భారత రాజ్యాంగములోని అధికరణము 40 ప్రకారము దేశములోని రాష్ర్ట ప్రభుత్వ చట్ట సభలు తమ పరిధిలోని స్థానిక ప్రభుత్వాలకు, అవి స్వయంగా, స్వతంత్రంగా పరిపాలన సాగించుటకు కావలసిన అధికారాలను కల్పించాలి. కాని భారత రాజ్యాంగము అమలులోనికి వచ్చి దశాబ్దాలు గడిచిపోయినప్పటికిని కూడా దేశములోని వివిధ రాష్ర్టాలు వాటి పరిధిలో గల స్థానిక ప్రభుత్వాలకు స్వతంత్రంగా, సమర్ధవంతంగా పనిచేయుటకు కావలసిన పరిస్థితులు కల్పించలేక పోయాయి. ఒకవేల కల్పించినను వివిధ రాష్ర్టాలలో వివిధ రకాలుగా వాటి ఇష్టానుసారము ఒకో రాష్ట్రములో ఒకో తీరుగా స్థానిక పరిస్థితులను బట్టి అధికారాలను కల్పించాయి. దీనితో ఒకే దేశములో వివిధ రాష్ర్టాలలో స్థానిక పాలన వివిధ రకాలుగా ఉండటము వలన, స్థాని ప్రభుత్వాలను పటిష్ట పరిచి, వాటికి తగిన అధికారాలను, నిధులను, మరియు అధికారులను స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలనె సదుద్దేశముతో, స్థానిక ప్రభుత్వాలు స్వతంత్రంగా, స్వయంగా, సమర్థవంతంగా పరిపాలన చేయుటకు కావలసిన అధికారాలు, ప్రాధికారము, నిధులు, మరియు తగిన అధికారులను, దేశములోని రాష్రాల చట్ట సభలు తగిన చట్టాలు చేయుట ద్వార స్థానిక ప్రభుత్వాలకు బదలాయించ వచ్చు అని రాజ్యాంగములోని అధికరణము 243 నకు సవరణ చేయుట ద్వార అధికరణము 243 ఎ నుండి 243 జడ్.డి వరకు క్రొత్త అధికరణములు చేర్చుట జరిగినది. దేశములోని పంచాయతీలు , స్థానిక ప్రభుత్వాలు కావున, వాటిని రాజ్యాంగములోని  రాష్ర్ట జాబితాలో పొందుపరచడము వలన, స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలకు అధికారాలను బదలాయించుటలో రాజ్యాంగములోని అధికరణము 246(3) ప్రకారము రాష్రాలలోని చట్ట  సభలకు పూర్తి అధికారము కల్పించబడినది. రాజ్యాంగములోని అధికరణము 243జి ప్రకారము స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు, 243 హెచ్ ప్రకారము పంచాయతీలు నిధుల సమీకరణ కొరకు పన్నులు విధించి వసూలు చేయు అధికారము మరియు రాష్ర్ట సంచిత నిధినుండి పంచాయతీలకు కొంత వాటాగా నిధుల కేటాయింపు మొదలైనవి, బదలాయింపు అధికారముసంబందిత రాష్ర్టాల చట్ట సభలకు కలదు. అందువలన రాజ్యాంగము అమలులోనికి వచ్చినప్పటినుండి 73వ రాజ్యంగా సవరణ జరుగు నాటికి కూడా పలు రాష్ట్రాలు స్థానిక ప్రభుత్వాల పట్ల చిన్నచూపు చూసాయి. అందుకొరకే రాజ్యాంగ సవరణ అవసరమైనది, అనివార్యమైంది. ఆ తర్వాత 73 వ రాజ్యాంగ సవరణ జరిగి మళ్లీ దశాబ్దాలు గడిచినను, దేశములోని పలు రాష్ర్టాల చట్ట సభలు రాజ్యాంగ స్పూర్తి తో స్థానిక ప్రభుత్వాలకు తగిన అధికారాలను, అధికారులను మరియు నిధులను, వాటిని వినియోగించే స్వేచ్ఛను స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీరాజ్ సంస్థలకు, ఇప్పటికి బదలాయించలేక పోయాయి. 


అప్పటి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారైన శ్రీ వి.కిశోర్ చంద్రదేవ్ గారు తేది 08-03-2013 నాడు లోక సభలో, పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు, ఇచ్చిన సమాదానము ప్రకారము భారత దేశములోని వివిధ రాష్రాలలో స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించిన అధికారాలు, అధికారులు, నిధులు, రాష్ట్రాల వారిగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్.
గ్రామపంచాయతీలకు మాత్రమే పన్నులు చేయు అదికారము కలదు.10శాఖలకు సంబందించిన అంశాలు బదలాయిస్తు ఉత్తవర్వులు జారీ అయినవి.1997-2000సంవత్సరముల మద్య 22 జి.వోలు జారీ అయినవి. అధికారులు సంబందిత శాఖల ఆధీనములోనే ఉన్నారు. కానీ వారు పంచాయతీరాజ్ సంస్థలకు పాక్షికముగా జవాబుదారులుగా ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్
పంచాయతీరాజ్ సంస్థలకు పన్నులు వసూలు చేయవు. నిధుల బదలాయింపు జరగలేదు. 29 అంశాల విధులు బదలాయించబడినవి. 20 శాఖలకు సంబందించి జి.వో లు జారి అయినవి. కాని అమలు జరుగుట లేదు. అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడలేదు.             
అస్సామ్.
పంచాయతీరాజ్ సంస్థలకు పన్నులు చేయు అదికారము కలదు. కాని బల ప్రయోగము చేయలేవు. మార్కెట్లు, రేవుల అద్దెలు ప్రధాన ఆదాయ వనరులు. 23 అంశాలు బదలాయించుటకు విధాన నిర్ణయము జరిగినది. కాని 7 అంశాలకు సంబందించి 6 శాఖల జి.వోలు జారీ అయినవి. కనీస స్థాయి అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించారు. అధికారులు వారి వారి శాఖలకు జవాబుదారులుగా ఉన్నారు ఉద్యోగులు వారి మాతృ శాఖలకు రిపోర్టు చేయట కొనసాగుచున్నది.
బిహార్
        పంచాయతీరాజ్ సంస్థలు పన్నులు చేయవు. కాని ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో కలవు. అధికారాల బదలాయించుటకు కార్యాచరణ మొదలయినది. 20 జి.వోలు జారీ అయినవి. అధికారులు తమ శాఖలకు జవాబుదారీగా ఉన్నారు. అంగన్వాడి, ఆరోగ్య కార్యకర్తలను మరియు ఉపాధ్యాయులను పంచాయితీరాజ్ సంస్థలు నియమించుచున్నాయి.

చత్తీష్ గఢ్
        పంచాయతీరాజ్ సంస్థలు వివిధ రకాల పన్నులు వసూలు చేయుటకు అధికారమివ్వమడినది. 12 శాఖల నుండి నిధుల బదలాయింపు జరిగినది. 27 అంశాల బదలాయించుటకు కార్యాచరణ చేయబడినది. జి.వో లు జారీ కాలేదు. 9 శాఖల అధికారులను స్థానిక ప్రభుత్వాలయిన పంచాయతీ సంస్థలు నియమించుటకు అధికారము కలదు.
గోవా.
        పంచాయతీరాజ్ సంస్థలు 11 రకాల పన్నులు విధించి వసూలు చేయు అధికారము కలదు. అన్ టైడ్ నిధులు పంచాయతీలకు ఇవ్వబడుచున్నవి. 18 అంశాలు గ్రామపంచాయతీలకు, 6 అంశాలు జిల్లాపరిషత్ లకు బదలాయించబడినవి. పంచాయతీరాజ్ సంస్థల పనులు చేయుటకు స్వంత సిబ్బంది కలరు.
గుజరాత్.
పంచాయతీరాజ్ సంస్థలు 8 ప్రధాన పన్నులు వసూలు చేయుచున్నవి. 2008-09 సంవత్సరములో 13 శాఖల నిధుల బదలాయింపు జరిగినది. 14 అంశాలు పూర్తిగా 5 అంశాలు పాక్షికంగా బదలాయించబడినవి. 14 శాఖల అధికారులను, విధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడినవి.
హర్యానా.
        పంచాయతీరాజ్ సంస్థలు వాటి భూములను అద్దెకు ఇవ్వడము, మద్యముపై సెస్సు విధించడము ద్వార ఆదాయమును సమకూర్చుకొనుచున్నవి. పంచాయతీరాజ్ చట్టము ద్వార 29 అంశాలు పూర్తిగా బదలాయించబడినవి. 10 జి.వో లు జారీ అయినవి. అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడినట్లు పేర్కొనబడలేదు.
హిమాచల్ ప్రదేశ్
        పంచాయతీరాజ్ సంస్థలు పన్నులు వసూలు చేయుటకు అధికారము కలదు. నిధుల బదలాయింపు జరగలేదు. 29 అంశాలలో 27 అంశాలు పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడినవి. అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడలేదు.
జమ్ము, కాశ్మీర్.
రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాల బదలాయింపు కార్యాచరణ చేపట్టుటకు ఉత్తర్వులు జారీచేసినది. నిధుల బదలాయింపు కొంతమేర జరిగినది. పంచాయతీరాజ్ సంస్థలకు సహకరించుటకు బదలాయించవలసిన అధికారులను గుర్తించడము జరిగినది. కాని వారిని బదలాయించలేదు.
జార్ఖండు
73వ రాజ్యాంగ సవరణ జరిగినప్పటినుండి 2010 నవంబరు, డిసెంబరు మాసములలో ప్రప్రథముగా పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిగినవి. అధికారాలు, నిధుల బదలాయింపు కార్యాచరణ ఏది చేయబడలేదు.
కర్నాటక.
7 ప్రధానమైన పన్నులను పంచాయతీరాజ్ సంస్థలు వసూలు చేయుచున్నవి. పంచాయతీరాజ్ చట్టములో అన్ టైడ్ నిధులను బదలాయింపును తప్పనిసరి చేసారు. పంచాయతీరాజ్ సంస్థల విధులను ప్రకటించుట ద్వార 29 అంశాలు పంచాయతీరాజ్ సంస్థలకు విధులు బదలాయించబడినవి. పంచాయతీరాజ్ ఉద్యోగులు పంచాయతీరాజ్ మరియు సంబందిత శాఖల నియంత్రణలో పనిచేస్తారు.
కేరళ.
పంచాయతీరాజ్ సంస్థలు 7 ప్రధానమైన పన్నులు వసూలు చేయుచున్నవి. అన్ టైడ్ నిధులను మరియు ప్రత్యేక పథకాల నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీచేయుచున్నవి. 29 అంశాల విధులను కేటాయించి బదలాయించబడినవి. బదిలీ చేయబడిన అధికారులపై పూర్తి యజమాయిషి పార్శిక క్రమశిక్షణ అధికారాలు పంచాయతీ సంస్థలకు కలవు.
మధ్యప్రదేశ్
పంచాయతీరాజ్ సంస్థలకు పన్నులు చేయు అధికారము కల్పించ బడినది. 19 విషయాలకు సంబందించి 13 రకాల నిధులను విడుదల చేయడము జరుగుచున్నది. 22 శాఖలకు సంబందించి 25 అంశాల విధుల కార్యాచరణ గురించి జి.వో.లు జారీ చేయబడినవి. 13 శాఖలకు సంబందించి సిబ్బంది పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినారు. రాష్ర్ట పంచాయతీ సర్వీసు ను ఏర్పాటు చేసినారు.
మహారాష్ట్ర.
 జిల్లాపరిషత్ మరియు గ్రామపంచాయతీలు పన్నులు వసూలు చేయుచున్నాయి. 11 శాఖల నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినవి. 11 అంశాలు పూర్తిగా బదిలీచేయబడినవి. 18 అంశాల పథకాలు పంచాయతీరాజ్ సంస్థలు అమలు చేయుచున్నాయి. అన్ని స్థాయిలలో 3వ మరియు 4వ తరగతి ఉద్యోగులందరు జిల్లాపరిషత్ వారే.
మణిపూర్.
22 శాఖల విధులను బదిలీ చేయటకు జి.వోలు జారీ చేయబడినవి. 5 శాఖల ఉద్యోగులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేస్తు జి.వోలు జారీ చేయబడినవి.
ఒరిస్సా.
 పంచాయతీరాజ్ సంస్థలు 6 రకాల పన్నులు వసూలు చేయుచున్నవి. అన్ టైడ్ నిధుల గురించి స్పష్టమైన ఆదేశాలు లేవు. 11 శాఖలు 21 అంశాలను బదిలీ చేసాయి. 11 శాఖల అధికారులు పంచాయతీరాజ్ సంస్థలకు జవాబు దారులుగా ఉంటారు.
పంజాబ్.
పంచాయతీరాజ్ సంస్థలు తమ భూములను వేలము వేయుట ద్వార ప్రధాన ఆదాయమును సమకూర్చుకొనుచున్నవి. నిధుల బదిలీ జరుగలేదు. ప్రధానమైన 7 శాఖల 13 అంశాల బదిలీ గురించి ఆమోదము జరిగినది. అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడలేదు.
రాజస్తాన్.
5 శాఖల నిధులను జిల్లాస్థాయి వరకు మరియు 10% అన్ టైడ్ నిధులను బదిలీ చేయుటకు జి.వోలు జారీ చేయబడినవి. 5 శాఖల నిధులను జిల్లా స్థాయి వరకు బదిలీ చేయబడినవి. క్రొత్తగా 5  శాఖల కార్యాచరణ జరిగినది. 5 శాఖల అధికారులను జిల్లా స్థాయి వరకు బదిలీ చేయబడినారు.
శిఖ్ఖిమ్.
పంచాయతీరాజ్ సంస్థలు పన్నులు వసూలు చేయవు. 17 శాఖల నిధులు 10% పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడుచున్నవి. అన్ టైడ్ నిధులు పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ జరుగుచున్నవి. 29 అంశాలు బదలాయించబడినవి. 16 శాఖల 20 అంశాలకు సంబందించి కార్యాచరణ జరిగినది. ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థల నియంత్రణలో ఉన్నారు. కాని పంచాయతీరాజ్ సంస్థలు పరిమిత స్థాయిలో నియంత్రణ చేపట్టుతాయి.
తమిళనాడు.
గ్రామపంచాయతీలకు మాత్రమే పన్ను విధించి వసూలు చేయు అధికారము కలదు. రాష్ర్ట స్వంత వనరులనుండి 9% నిధులను స్థానిక సంస్థలకు కేటాయించినారు. దానిలో గ్రామీణ స్థానిక సంస్థలు 58% వాటా పొందుతాయి. 29 అంశాలు బదలాయించబడినవి. 10 శాఖలకు సంబందించి 20 జి.వోలు జారి అయినవి. కాని అమలు జరుగుట లేదు. అధికారులను పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించబడలేదు.
త్రిపుర.
ప్రజాపనుల శాఖ, ప్రాథమిక విద్య, సాంఘిక విద్య, సంక్షేమ శాఖల నిధులు పాక్షికముగా మరియు పెన్సను నిధులను, అన్ టైడ్ నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినవి. సాగునీటి పథకాల, ప్రాథమిక విద్య, అనియత విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖల నిధులను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినవి. పంచాయతీరాజ్ సంస్థలకు బదలాయించిన 5 అంశాల సంబందించి ఉద్యోగులు పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినారు.


ఉత్తర ప్రదేశ్.
మూడంచెలలోని పంచాయతీరాజ్ సంస్థలకు పన్ను వసూలు చేయు అధికారము కలదు.  12 శాఖల యొక్క 16 అంశాలను పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయబడినవి. పంచాయతీరాజ్ సంస్థలకు అధికారులపై నియంత్రణ లేదు.
ఉత్తరాఖండ్.
జిల్లాపరిషత్తులు మాత్రమే పన్నులు వసూలు చేయుచున్నవి. 3 అంశాల విధులకు సంబందించిన నిధులు మాత్రమే పంచాయతీరాజ్ సంస్థలకు అందుబాటులో ఉన్నాయి. 14 అంశాలకు సంబందించి పరిపాలన మరియు ఆర్థికపరమైన అధికారాను బదలాయిస్తు మాష్టరు జి.వో 2003 సంవత్సరములో జారీచేయ బడినది. 14 అంశాలకు సంబందించిన ఉద్యోగులపై పర్యవేక్షణాధికారము పంచాయతీరాజ్ సంస్థలకు కలదు.
పశ్చిమ బెంగాల్.
గ్రామపంచాయతీలు పన్నులు విధించి వసూలు చేయగలవు. అన్ టైడ్ నిధులు యస్.ఎఫ్.సి మరియు టి.ఎఫ్.సి నిధులను కేటాయించారు. 5 శాఖలు తమ బడ్జెట్ లో పంచాయతీ విభాగము ఏర్పాటు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వము 28 అంశాల బదిలీకి అంగీకరించింది. 14 శాఖలు 27 అంశాలకు సరిపోవు జి.వోలను జారీ చేసాయి. పంచాయతీ ఉద్యోగులు వివిధ రకాల జిల్లా స్థాయికు మార్చబడినారు. పంచాయతీ ఉద్యోగులు మినహా మిగతా 7 శాఖల వారిని పంచాయతీలకు బదిలీ చేసారు.
73వ రాజ్యాంగ సవరణ జరిగి రెండు దశాబ్దాలు గడిచినను పలు రాష్ర్టాలలో నే గాక అవిభక్త ఆంద్రప్రదేశ్  లోను పూర్తి స్థాయి అధికార వికేంద్రీకరణ జరగలేదు. స్వపరిపాలన కొరకు రెండుగా విడిపోయిన రాష్ట్రాలకు ఎన్నిక కాబడిన పాలకులు, ఏలాగైతె తమ పరిపాలన తాము కోరుకున్నారో అలాగె స్థానిక ప్రభుత్వాల పాలకులు మరియు ప్రజలు తమ పాలన తాము చేసుకుంటామనుటలో తప్పు లేదు. అలాగే కేంద్ర సంచిత నిధినుండి వాటాలు తీసుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వాలు కూడా స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీలకు కూడా రాష్ట్ర సంచిత నిధుల నుండి లేక రాష్ట్ర స్వంత ఆదాయములో నుండి కొంత నిధిని కేటాయిస్తు శాసనాలు చేసి చట్టాలు తీసుకొని వస్తేనే తప్ప 73 రాజ్యాంగ సవరణ లక్ష్యము పూర్తిగా నెరవేరదు.           


Tuesday, June 17, 2014

గ్రామపంచాయతీలలో ఇంటిపన్నులను గాని ఇతర పన్నులను గాని రాజీ చేసుకొని చెల్లించు విధానము

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షను 72
పరిశ్రమల యజమానులు గాని, గృహసముదాయాల యజమానులు గాని తాము చెల్లించే ఇంటి పన్నులు గాని ఇతర పన్నులు గాని గ్రామపంచాయతీ తో రాజీ కుదుర్చుకొనుటకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 లోని సెక్షను 72 వీలు కల్పించినది. దాని ప్రకారము జి.వో.నెం. 594 పంచాయతీరాజ్ గ్రామీణాభివృధ్ధి శాఖ తేది. 11-08-1995 ద్వార, రాజీ కుదుర్చుకొనుటకు నియమాలు జారీ కాబడినవి.
నియమాలు.